జానక్యాః కమలాంజలి పుటేః యా పద్మ రాగాయితాః
న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయితాః
న్యస్తా శ్యామల కాయ కాంతి కలితాః యా ఇంద్ర నీలాయితాః
ముక్తాస్తా శ్శుభదా భవంతు భవతాం శ్రీ రామ వైవాహికాః
పచ్చటి పందిళ్ళు మామిడి తోరణాలు వేదమంత్రాలూ, బెల్లంజీలకర్ర, మంగళ వాయిద్యాలు అక్షంతలమద్య పెద్దల దీవెనలు విందులు వినోదాలు పట్టుచీరల రెపరెపలు పసిడి మెరుపులు , వధువు వరుడి ఓర చూపులు అమ్మలక్కల ఆనందభాష్పాలు వెరసి హిందు వివాహ వేడుక .
చైత్రశుక్ల నవమినాడు చేసే సీతారాముల కల్యాణానికి ఉండే ఒక ప్రత్యేకత అందరినీ ఆకట్టుకుంటుంది. పండిత పామరులందరినీ కట్టి పడేస్తుంది. సీతారామకల్యాణం రమణీయం కమనీయం. జానకమ్మ రామయ్యల కల్యాణంలో తలంబ్రాల వేడుక మరీ అద్భుతం. దశరథ మహారాజు లేకలేక కన్నబిడ్డ శ్రీరాముడు. కౌసల్య ఎన్నో వ్రతాలు, నోములు నోచి పొందిన ముద్దుల తనయుడు. అలాంటి రాముడిని విశ్వామిత్రుడు లోకకల్యాణం కోసం యాగరక్షణకు తీసుకెళ్లాడు. రాముడు తమ్మునితో కలిసి రాక్షస సంహారం చేశాడు. యాగ పరిసమాప్తి జరిగింది. శాంతి ఎల్లెడలా పరిడవిల్లింది.
పరిపూర్ణమైనవాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆయన ఏ రూపంలో వచ్చినా, దాని పరిపూర్ణతను పండించగలడు. అందుకే ఆదర్శమూర్తి రాముడిగా ఆ స్వామి పూర్ణత్వాన్ని ప్రకటించాడు. ఆ నిండుదనమే ఒక మణిదీపంగా మానవజాతికి వెలుగు పంచుతోంది.
ఇక తిరుగు ప్రయాణంలో జనక మహారాజు దగ్గరున్న శివధనుస్సు కథను తన శిష్యులకు చెప్పాడు విశ్వామిత్రుడు. వారిలో ఉత్సాహం ఉరకలెత్తింది. ఆ ధనుస్సును చూడాలనుకున్నారు. అంతే! రామలక్ష్మణులను వెంటబెట్టుకొని మిథిలకు చేరాడు విశ్వామిత్రుడు. జనకుడు వారికి స్వాగతం పలికాడు. సేవకుల సాయంతో శివధనుస్సును యాగశాలకు రప్పించాడు. రాముడు గురువాజ్ఞపొంది, ధనస్సుకు నమస్కరించాడు. శివధనుర్భంగం చేశాడు. సంతోషాతిశయంతో సీతను రామునకు అర్పించాడు జనకుడు. దేవతలు దుందుభులు మ్రోగించారు. మనుజులు మహోత్సం చేసుకున్నారు. సిద్ధులు, మునులు, లోకాసమస్తా సుఖినోభవన్తు అని దీవించారు. ఆ సీతారాముల కల్యాణం లోకానికి దివ్యసందేశాన్నిచ్చింది. రాముని చరితం మానవులకు మార్గగామి అయితే సీతాకల్యాణం కోమలులకు కంఠోపాఠం కావాలి. సీతారాముల కల్యాణం నిత్యస్మరణీయం. అందులో శివధనుర్భగం ఆత్మపై విజయం అంటారు కొందరు. ప్రణవాన్ని వంచిన వారికి ఆత్మను అర్పించదగును అంటోంది ఉపనిషత్తు. ఆ ప్రణవమే ధనుస్సు. ఎంత మంది ప్రయత్నించినా చివరకు రామునకే వంగింది ఆ శివధనుస్సు. ఎందుకంటే జీవుడికి దేవుడికి ఉన్న సంబంధ చిహ్నమే ధనుస్సు. అసలు ప్రణవానికి శాస్త్రార్థ ఓంకారం, ధనుస్సు అనే కదా. అందుకే దేవుడైన రాముని చేతిలోనే విరిగింది శివధనుస్సు.
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్న అభిజిత్ ముహూర్తాన అనగా, మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు. శ్రీ మహావిష్ణువు భూలోకంలో శ్రీరాముడిగా మానవరూపంలో అవతరించిన రోజున దేశమంతటా పండుగ చేసుకుంటారు. చైత్ర శుద్ధ నవమి రోజు శ్రీరాముడి వివాహం, పదునాలుగు సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైన రోజు కూడా చైత్ర శుద్ధ నవమే. ఈ సమయంలో ఉత్తరాది రాష్ట్రాలలో బాలరాముడి జన్మదినోత్సవం చేసుకుంటారు. మన తెలుగు రాష్ర్టాల్లో మాత్రం శ్రీరామ కల్యాణం జరుపుకుటారు. తెలుగు రాష్ట్రాలలో ఊరూరా సీతారాముల విగ్రహాలకు వివాహం చేసి కల్యాణ రాముణ్ణి సాయంత్రం ఊరేగిస్తారు. మహారాష్ట్రలో చైత్ర నవరాత్రి పేరుతో జరుపుకుంటే తెలుగు రాష్ట్రాలలో వసంతోత్సవం పేరిట తొమ్మిదిరోజులు నిర్వహిస్తారు. రామనవమినాడు ఉదయాన్నే సూర్యుడికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ప్రారంభం అవుతుంది.
శ్రీరాముడు మధ్యాహ్నం 12:00 గంటలకు పుట్టాడు కాబట్టి మధ్యాహ్న సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశంలో శ్రీరామనవమిని అత్యంత వైభవంగా చేస్తారు. భక్తులు సాయంత్రం అందంగా అలంకరించిన రథంపై శ్రీరాముని ఊరేగిస్తారు. ఈ ఊరేగింపులో సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుల పాత్రధారులు రథంపై ఆశీనులై ఉంటారు. ఆ రథం వెంట పురాతన వేషధారణల్లో శ్రీరాముని సైనికులు అనుసరిస్తారు.
మధురమైనది రామనామం
రమ్యమైనది, మధురమైనది రామనామం. రామా అంటే చాలు పాపాలన్నీ పటాపంచలైపోతాయట. అందుకే ‘తారకనామము కోరిన దొరకదు ధన్యుడనైతిని చాలన్నా’ అని శ్రీరామదాసు సైతం రామనామం కన్నా తనకు ఏమీ అక్కర్లేదని తన కీర్తనలతో కీర్తించాడు. రామ శబ్దంలో 'రా' అనే అక్షరం పలకగానే నోరు తెరుచుకుని మనలోపల ఉన్న పాపాలు అన్నీ బయటకు వచ్చి రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. 'మ' అనే అక్షరం ఉచ్చరించినప్పుడు నోరు మూసుకుంటుంది కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మానవుల శరీరాలలోకి ప్రవేశించలేవు.
కైలాసంలో ఒక రోజు పార్వతీదేవి పరమశివుణ్ణి ఈ విధంగా ప్రశ్నించింది 'స్వామీ! 'కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం' అని విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది. దానికి ఈశ్వరుడు 'ఓ పార్వతీ! నేను నిరంతరం ఆ ఫలితం కోసం జపించేది ఇదే సుమా!' అని చెప్పి ఈ శ్లోకంతో మంత్రోపదేశం చేశాడు.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే !
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే !!
ఈ శ్లోకం మూడుసార్లు స్మరించినంత మాత్రానే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. 'రామ' అంటే రమించడం అని అర్థం కాబట్టి మనం ఎప్పుడూ మన హృదయాలలో శ్రీరాముని స్మరిస్తూ ఉండాలి. ఎవరయితే భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలో మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకరుడే ఈ తారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అష్టాక్షరి మంత్రం అయిన ఓం నమో నారాయణాయలో ‘రా’ అనే అక్షరం, పంచాక్షరి మంత్రం అయిన ఓం నమఃశివాయలో ‘మ’ అనే అక్షరం కలిస్తే రామ శబ్దం ఉద్భవించింది. వీటిని జీవాక్షరాలు అంటారు. రామ అనే శబ్దం శివకేశవుల సమానత్వాన్ని తెలుపుతుంది. రామునికన్నా కూడా రామనామం గొప్పదని రామాయణ కావ్యం వెల్లడిస్తుంది.
మనిషి సలక్షణంగా తన మనుగడ సాగించాలంటే తగినంత ఉష్ణం, శీతలం తప్పనిసరిగా కావాలి. ‘రామ’ శబ్ద ఉచ్చారణ మనకు అలాంటి శక్తిని కలగజేస్తుంది. రామ శబ్దంలో ‘రా’ అన్న అక్షరం అగ్నికి, ‘ఆ’ అనే అక్షరం సూర్యడికి, ‘మ’ అక్షరం చంద్రునికి ప్రతీక. కనుక వాటి అర్థసారం ఈ పద ఉచ్ఛారణలో ఇమిడి ఉంటుంది. అదేంటి రామ అన్నది రెండే అక్షరాలు కదా మూడు అర్థ విశేషాలు ఏమిటి? అనుకుంటున్నారా? చూడ్డానికి రెండుగా ఉన్నా వాస్తవానికి అవి మూడు అక్షరాలు. ‘రా’, ‘ఆ’, ‘మ’ అంటే రాలో ఉన్న దీర్ఘాన్ని ‘ఆ’ గా తీసుకుంటే అవి మొత్తం మూడు అక్షరాలే అవుతాయి.
వివాహబంధానికి ఆదర్శం
భార్యాభర్తలు అంటే లక్ష్మీనారాయణ స్వరూపాలే అంటారు. కన్యాదాత కాళ్ళు కడిగి కన్యాదానం చేసేది సాక్షాత్తూ ఆ విష్ణుస్వరూపునికే అని భావిస్తాడు. అందులో ఉన్న పరమార్థాన్ని తేట తెల్లం చేయడానికే జనకుడు ‘‘ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవ’’ అంటాడు. ఈమెను చేపట్టిన నీకు శుభం కలుగుతుందంటాడు. నారాయణ దత్తమైన మనస్సుకు శుభం కాక మరేమి కలుగుతుంది? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎవరైతే తనను ‘నాస్తి త్వమేవ శరణం మమ’ అంటారో వారి యోగ క్షేమాలు అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పాడు కదా. అందుకే నారాయణునికి దత్తం చేసిన మనస్సు నారాయణ స్వరూపమే అవుతుంది. అందుకే సీతారాములు అనురూపులు. సీత హృదయంలో ఉన్నదే రాముని హృదయంలోనూ ఉంటుంది. రాముని హృదయఫలకమే సీతాహృదయం. నూతన వధూవరులను ఆశీర్వదించేటపుడు సీతారాముల లాగా ఉండమనడంలోని పరమార్థమిదే. స్థూలకంటికి ఏక పత్నీవ్రతం ఆచరించినా శ్రీరాముడు సూక్ష్మంగా చెప్తున్నదీ అదే. జగం, జగన్నాథుడు వేరు కాదుకదా. సీతారాములను నిత్యం స్మరించడమే కాదు వారి జీవనయానాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. వారి నడిచిన దారిలోనే మనం నడవడానికి నడుం కట్టాలి. సీతారామ కల్యాణంలోని ఆ వివాహ విశిష్టతను అవగాహన చేసుకోవాలి.
మానవ సంబంధాలు గతి తప్పి, వికృత విశృంఖల ప్రవర్తన వెర్రితలల వేస్తున్న ఈ రోజుల్లో మనిషితో మనిషిలా ఎలా జీవించాలన్న విషయం తెలుసుకోవడానికి సీతారాముల జీవితాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం మునపటికన్నా ఎక్కువగా ఉన్నది ఈరోజుల్లోనే.రామకథా శ్రవణం, రాముని గుణగుణాల అధ్యయనం, రామున్ని అనుసరించే ప్రయత్నం చేయడం ఎక్కువ అవసరం.
శ్రీరామ పూజా విధానం
శ్రీరామనవమి రోజు ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి, తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. పూజామందిరము, గడపకు పసుపు కుంకుమలు దిద్ది ఇంటి ముంగిటను రంగవల్లికలతో అలంకరించాలి. పూజకు ఉపయోగించే పటాలకు గంధము, కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి. శ్రీ సీతారామ, భరత లక్ష్మణ శతృఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను గానీ పూజకు ఉపయోగించవచ్చు. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు, పండ్లు సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామరక్షా స్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముణ్ణి స్తుతించాలి. ఇంకా రామాయణంలో ప్రత్యేకించి శ్రీరామ పట్టాభిషేక అధ్యాయ పారాయణం చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి.
నైవేద్యం విశిష్టత
శ్రీరామనవమి వేసవి ప్రారంభంలో వస్తుంది కాబట్టి శ్రీరాముణ్ణి పూజించిన తరువాత, మిరియాలు, బెల్లంతో కొత్తకుండలో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి పంచి పెడతారు. ఈ ప్రసాదాల వెనుక ఆయుర్వైద్య పరమార్థం కూడా ఉంది. భగవంతుడికి నివేదించే ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. శరద్ ఋతువు, వసంత ఋతువు యముడి కోరలు లాంటివే అని దేవీ భాగవతం చెబుతోంది. పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు వసంత ఋతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనం ప్రసాదిస్తూ, ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేదం నిర్థారిస్తుంది. అదే కాకుండా పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది.
అలాగే పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది, జీర్ణశక్తి అభివృద్ధి పరుస్తుంది. దేహకాంతికీ, జ్ఞానానికీ ప్రతీక పెసరపప్పునే వడపప్పు అంటారు ఇది మండుతున్న ఎండలలో 'వడదెబ్బ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుంది. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది బుధ గ్రహం బుద్ది బలానికి గుర్తు. మనలోని చెడుబుద్దిని నశింప చేసి మంచిని పెంచుకోవాలని చెప్పడం కూడా ఇందోలోని పరమార్థం.